ఎండాకాలం సెలవలు అయిపోయాయి. బడి మొదటిరోజు కావటంతో ఎక్కువమంది రాలేదు. ఐదవ తరగతిలో పదిమంది అబ్బాయిలు, నలుగురు అమ్మాయిలు వచ్చారు. సెలవుల కబుర్లతో, కొత్త పరిచయాలతో గదంతా ఒకటే సందడిగా ఉంది. బెల్లు మోగడంతో మాష్టారు వచ్చారు.
పాఠాలు మొదలుపెట్టేలోపు తలుపులోనుంచి ముక్కులు బద్దలుకొట్టేంత దుర్వాసన గుప్పున కొట్టింది! ఆ కంపు కుళ్ళిపోయిన కోడిగుడ్లదో, లేక చచ్చిన ఎలుకదో పోల్చుకోలేక అందరూ ముక్కు మూసుకొని శ్వాస బిగబట్టి కూర్చున్నారు.
“లోపలికి రావచ్చా సార్?” తెల్లగా బక్కగా ఉన్న అబ్బాయి గదితలుపు దగ్గర నిలబడి అడిగాడు.
వాసనకే రంగులు ఉండివుంటే పేడ కళ్ళాపిలో కుళ్ళిపోయిన నేరేడికాయలు కలిపిన రంగుతో ఆ గదంతా నిండిపొయేదేమో!! అప్పటికే శ్వాసనిలిపి అరనిముషం కావడంతో మాష్టారుకు కళ్ళు చెదిరినట్లుగా అనిపించాయి. నోరు తెరిస్తే ఎక్కడా విషపు వాయువులు పొట్టలోకి దూరుతాయో అని పెదాలు మెదపకుండా ఆ అబ్బాయిని వచ్చి మొదటి బెంచీలో కూర్చోమని సైగ చేశారు. ఆ అబ్బాయి వచ్చి కూర్చోగానే రెండవ బెంచీలోని అరుణ్ కు కడుపులో తిప్పినట్లయింది.
ఎంతసేపని ఊపిరి ఆపుకోని కూర్చుంటారు? అందరూ మెల్లగా ఆ దుర్గంధాన్ని సహించే ప్రయత్నం చేయసాగారు. కానీ మాష్టారుగారి ప్రయత్నం విఫలం అయింది. “రిజిష్టరు తేవటం మర్చిపోయాను. ఇప్పుడే వస్తాను అందరూ నిశబ్ధంగా కూర్చోండి” అని సాకు చెప్పి గదిలోంచి బయట పడ్డారు.
ఆ దుర్గంధానికి కారణం మొదటి బెంచీలో కూర్చున్న కొత్తబ్బాయి తలనూనె అని తన వెనుకే వాంతిని ఆపుకోని కూర్చున్న అరుణ్ కు అర్థమయింది.
“నీ పేరేంటి?” కొత్తబ్బాయిని భుజం మీద తట్టి అడిగాడు అరుణ్.
“పవన్. మరి నీ పేరు?” వెనక్కి తిరిగి చక్కటి చిరునవ్వుతో కొత్తబ్బాయి అన్నాడు.
“నా పేరు అరుణ్. నువ్వు ఏమీ అనుకోనంటే ఒక విషయం అడగనా?”
అరుణ్ అడగబోయే ప్రశ్న ఏమైవుంటుందా అనుకుంటూ “ఊ!” కొట్టాడు పవన్.
“నువ్వు తలకు రాసినది ఏమి నూనె?” ఇబ్బంది పడుతూ అడిగాడు అరుణ్.
“ఓ! అదా..!? మూలికలు వేసి కాసిన ఆముదం నూనె. నా గిరజాల జుట్టుని అణచడానికి, చదువులో దృష్టి నిలపడానికి పనిచేస్తుందని అమ్మ చెప్పింది” కళ్ళలో మెరుపుతో ఉత్సాహంగా చెప్పాడు పవన్.
“చుట్టుపక్కల వాళ్ళ దృష్టి చెదరగొట్టడానికి కూడా బాగా పనిచేస్తోంది” అరుణ్ పక్కన కూర్చునే బండ సునిల్ గొణిగాడు.
“ఏంటి? ఏమైంది?” అమాయకంగా అడిగాడు పవన్.
“అదీ.. మరేమో. . “ అరుణ్ మాటలు కూర్చేలోపు “ఏమైందా!? నీ నూనె కంపుకి ఇక్కడ మా ప్రాణాలు పోయేలా ఉన్నాయి” బండ సునిల్ ముక్కు మూసుకునే అన్నాడు.
“మూలికల వల్లేమో.. నూనె కొంచం ఘాటైన వాసన వస్తోంది” మోచేత్తో పక్కనున్న సునిల్ ని తడుతూ అరుణ్ అన్నాడు.
గదిలో ఉన్న వాళ్ళంతా ముక్కుమూసుకుని తన వైపే అనుమానంగా చూస్తున్నారని గమనించి పవన్ లేచి బయటికి వెళ్ళిపోయాడు. తను వెళ్ళిన ఒక నిముషానికి పంక్చర్ అయిన టైర్లలాగ, బెజ్జం పడిన రబ్బరు బంతులలాగ గాలి వదులుతూ-పీలుస్తూ పిల్లలంతా గది నిండా పరుగులెత్తారు.
ఆ గోలకి మాష్టారు వచ్చి, అందరినీ కోప్పడి కూర్చోబెట్టారు. గది కిటికీలు తెరిపించి మధ్యానం భోజనం బెల్లు కొట్టేదాక హయిగా పాఠాలు చెప్పారు. భోజనం వేళలో అందరూ డబ్బాలుతెరిచి తింటూ కబుర్లు చెప్పుకుంటున్నారు. సగంమంది ప్రొద్దున జరిగిన దుర్వాసన దాడి నుంచి ఇంకా తేరుకోలేదు. అరుణ్ కూడా అలా తేరుకోలేని వాళ్ళలో ఒకడు. “పవన్ బాధపడ్డాడేమో కదా..!?” సునిల్, తనూ ఒకటవ తరగతి నుంచి కలిసి చదువుకోవడంతో చొరవ తీసుకుని అడిగాడు.
“పడితే పడనీ, మనం మాత్రం ఆ వాసన భరించి బాధ పడలేదా!?” సూటిగా జవాబు చెప్పి తిండి మీదకు ధ్యాస మళ్ళించాడు బండ సునిల్.
“దయ్యం! దయ్యం!!” కేకలేస్తూ తరగతి గదిలోకి పరిగెత్తుకొచ్చింది తలుపు దగ్గర నిలబడ్డ పిరికి పద్మ.
అందరూ తలుపువైపు భయంగా చూశారు. దయ్యం కాదు, పవన్. తలమీద పిట్టగూడులాగ కనుబొమ్మల దాకా వచ్చిన గిరజాల జుట్టు. తలంటి స్నానంచేసి, సాంబ్రాణిపొగ కూడా పట్టించాడు. ఆ జటాలతో అఘోరాలాగా భయంకరంగా ఉన్నాడు. తను రావటం గమనించిన మాష్టారు ఆఫీసుగది నుంచి పరిగెత్తుకొచ్చారు. లోపలికొస్తున్న పవన్ ను చెయ్యిపట్టుకోని ఆపి - ఇలా బడిలోకి రావటానికి వీల్లేదు, క్షవరం చేపించుకోని రమ్మన్నారు.
“మా అమ్మకు నేనొక్కడినే కొడుకునండీ. మా అమ్మ, ఆరుసంవత్సరాలు అమ్మాయి పుట్టాలని దేవికి పూజలు-వ్రతాలు చేస్తే నేను పుట్టానట. ఇప్పుడు నేను ఈ జుట్టు కత్తిరిస్తే అమ్మ ఇంట్లోకి రానివ్వదు” అని పవన్ మాష్టారు కాళ్ళా-వేళ్ళా పడ్డాడు. మాష్టారు మనసు కరిగిపోయింది. “సరే, నువ్వు లోపలికెళ్ళి కూర్చో. నేను సాయంత్రం మీ అమ్మగారితో మాట్లడతానులే.” అని మాష్టారు చెప్పారు. ఈలోపు బెల్లు మోగటంలో లెక్కలు చెప్పటం ప్రారంభించారు.
పవన్ జుట్టు కొండలా అడ్డుంటే బోర్డుమీద మాష్టారు రాసిన లెక్కలేమి కనబడతాయి? రెండవ బెంచీలో ఉన్న అరుణ్, సునిల్ లు నిలబడి రాసే ప్రయత్నం చేశారు. ఆ వెనకనున్న అబ్బాయిలకి అసలేమీ కనబడక వీళ్ళిద్దరినీ లాగి కూర్చోబెట్టి, వాళ్ళు నిలబడ్డారు. ఆ వెనుకవాళ్ళు వాళ్ళని లాగారు. ఇలా పెళ్ళిలో డిస్కో లైట్లలాగా, ఆర్మీ డ్రిల్లులో లెఫ్టు-రైటు కొట్టినట్లుగా, బ్రేక్ దాన్సులో స్టెప్పులేసినట్లుగా ఐదు-పది నిముషాలపాటు కూర్చోవటాలు-నిలుచోవటాలు సాగాయి. ఇదంతా చూసిన మాష్టారుకు విసుగొచ్చి ఇంటికి పొమ్మని అందరికీ సెలవిచ్చారు.
రెండవరోజు మాష్టారు పవన్ ను వెంటపెట్టుకొచ్చారు. మంగలికి కూడా పవన్ తలమీద ఉండిన పిచ్చుకగూడు నచ్చినట్లు లేదు, జుట్టు మొదళ్ళదాకా గొరిగిపారేశాడు. చిన్నప్పుడు చదువుకున్న కథలో రాజుగారి భార్యకి రెండెంట్రుకలన్నా ఉండేవి. కానీ పవన్ తలమీద లైటేసి వెతికినా ఒక్క వెంట్రుక కూడా దొరకదు. “అఘోరా కన్నా బోడిగుండు సన్యాసిని భరించటం నయం! ” అనుకుని పిల్లలెవరూ పవన్ ను వెక్కిరించలేదు.
పవన్ వచ్చి కూర్చున్నాడు. “హమ్మయ్య! ఎలుక చచ్చిన వాసన లేదు! పిచ్చుకగూడు లేదు..!” అరుణ్ మనసులో అనుకున్నాడు. మాష్టారు పాఠాలు చెప్పటం మొదలెట్టారు. ఎదురుగా ఉన్న పవన్ గుండు మీద ఎండ పడి మిలమిలా మెరుస్తోంది. ఎంత ప్రయత్నించినా మాష్టారుగారి ధ్యాస, వెనక బెంచీలో ఉన్న పిల్లల ధ్యాస భూగోళశాస్త్రం మీద కాకుండా పవన్ గుండు మీదే నిలుస్తోంది. పాపం ఇవేమీ తెలియని పవన్ తలమీది బరువు దిగడంతో ఎండకి మండుతున్న గుండుని మధ్య-మధ్యన సవరించుకుంటూ పాఠాలు వింటున్నాడు.
వెనకనున్న అరుణ్ సంచిలోనుంచి ఎర్రటోపీ తీసి పవన్ కు అందించాడు. పవన్ దాన్ని స్నేహచిహ్నంగా భావించి ఆనందంగా తలమీదున్న రెండవ సూర్యుడిని కప్పేశాడు. దానితో ఆ తరగతిగదిలోని కష్టాలకు తెర పడింది.
